మద్యం ధరల పెంపుపై ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో మద్యం అమ్మకాలు, ధరల పెంపు వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగింది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లిక్కర్ షాపులు ఓపెన్ చేయడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. షాపుల దగ్గర సామాజిక దూరం కూడా పాటించడం లేదని నేతలు మండిపడుతున్నారు. ఇటు ప్రతిపక్షం విమర్శలకు అధికార పార్టీ కూడా కౌంటర్ ఇస్తోంది. మద్యం ధరల పెంపు, తాజా పరిణామాలపై ఎమ్మెల్యే రోజా స్పందించారు.


ధరలు పెంచితే పేదవాడు మద్యానికి దూరం అవుతారని ఉద్దేశంతోనే ప్రభుత్వం ధరలు పెంచిందన్నారు రోజా. మద్యపాన నిషేధంలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. మద్యం ధరలు పెంచితే టీడీపీ నేతలు ఎందుకు బాధపడతున్నారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తే.. జగన్‌ సర్కార్ దశలవారీగా మద్య నిషేధం చేస్తోందన్నారు.

రాష్ట్రంలో 40 వేల బెల్టుషాపులు, 20 శాతం వైన్‌ షాపులు, 40 శాతం బార్లను తొలగించారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటున్నారు రోజా. కరోనా కట్టడికి సీఎం జగన్‌ తీవ్రంగా కృషి చేస్తుంటే.. చంద్రబాబు,టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.